‘తెలంగాణ’ పదం – సంస్కృత పరిష్వంగ సుఖం

5

సంస్కృత భాషలోంచి నిరాఘాటంగా తెలుగులోకి శబ్దజాలం వచ్చిచేరినందువల్ల తెలుగు సుసంపన్నభరితమైంది. పూవుకు తావిలా తెలుగుకు అమరం సహజంగా అమరింది. ఈ సంస్కృత శబ్దజాలం తెలంగాణ తెలుగులోనూ వెలిగిపోతున్నది. తెలంగాణ ప్రాంతంలోని పండితుల్లోనే కాకుండా సామాన్య ప్రజలు నిత్యం జరుపుకొనే భాషా వ్యవహారాల్లో అద్భుతంగా వుంది.

తెలుగు భాషకూ, సంస్కృతానికీ అవినాభావ సంబంధం వుంది. అది తల్లీబిడ్డల బంధం కాకపోవచ్చును. అక్కాచెల్లెళ్ళ అనుబంధం అవకపోవచ్చును. అయితేనేం, తెలుగు పండిత ప్రకాండులెందరో అమరం నెమరు వేసారు. అనేకానేక సంస్కృత గ్రంథాలు రాసారు. దాదాపు వెయ్యేండ్ల నుంచి ఈనాటికీ అవ్యా హతంగా సాగిన, ఇంతోఅంతో సాగుతున్న, కాస్తో కూస్తో సాగబోతున్న పద్య సాహిత్యంలోని పదసంపదకు మూలధాతువు సంస్కృత శబ్దజాలమే! తెలుగు వ్యాకరణ గ్రంథాలు, అలంకారశాస్త్రాలు, ఛందశ్శాస్త్రాలు… యిత్యాది వివిధ శాస్త్ర పరిభాష అంతా సంస్కృతమే! తెలుగులోని మార్గ సాహిత్యంపై సంస్కృత భాషా ప్రభావం బాగా ఎక్కువ. ఆ ప్రభావం పదాల్లోనే కాకుండా వస్తు స్వీకరణలోనూ కన్పిస్తుంది. తెలుగులో దాదాపు ముప్పై శాతం సంస్కృత పదాలు వుండడానికి కారణాలు అనేకం. సంస్కృత భాషాధిపత్య ధోరణి అని కొందరు, తెలుగు భాషా పండితుల్లో నెలకొన్న అమరభాషా వ్యామోహం అని ఇంకొందరు, భాషల మధ్య ఆదానప్రదానాలు సహజం అని మరికొందరు, తెలుగులోనే కాదు- ఏ భాషలోనైనా భావ ప్రకటనా సంగ్రహణాలకు అవసరమైన అన్ని పదాలూ వుండవని అన్యులు.. యిట్లా అనేక కారణాలు చెప్పారు.

సంస్కృత భాషలోంచి నిరాఘాటంగా తెలుగులోకి శబ్దజాలం వచ్చిచేరి నందువల్ల తెలుగు సుసంపన్నభరితమైంది. కొన్ని సందర్భాల్లో ఏది తెలుగు, ఏది సంస్కృతం అని విడమరిచి చెప్పలేనంత సందిగ్ధస్థితి నెలకొంది. పూవుకు తావిలా తెలుగుకు అమరం అమరింది సహజంగా. అయితే ఈ సంస్కృత శబ్దజాలం తెలంగాణ తెలుగులోనూ వెలిగిపోతున్నది. తెలంగాణ ప్రాంతంలోని పండితుల్లోనే కాకుండా పండితేతర ప్రజాసమూహాల్లో అంటే సామాన్య ప్రజలు నిత్యం జరుపుకొనే భాషా వ్యవహారాల్లో అద్భుతంగా వుంది. రాజపూజితంగ, ఉచితార్థంగ మొదలైనవి పదస్వరూపాల్లో ఏమాత్రం మారకుండా సంభాషణల్లో దొర్లుతాయి. అంటే తత్సమాలున్నాయి. ఇంచుక పద స్వరూపం మారిన ఇంటింటి ‘‘మారాజులు’’, ‘‘మా’’యెల్లెమే వంటి తద్భవాలు వున్నాయి. ‘‘కోపగొండి’’లాంటి మిశ్రసమాసాలు అనేకం. పండితులు అయిష్టంగా భ్రుకుటి ముడివేసిన దుష్ట సమాసాలున్నాయి. ఇది ప్రజాస్వామిక యుగం. ప్రజలు మాట్లాడుతున్నవన్నీ సాధురూపాలుగా స్వీకరించాల్సిన సన్నివేశమిది. ప్రజల పలుకుబడులన్నీ, పదాలన్నీ సాధువులే, శిష్టసమాసాలే!

తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణుల సంభాషణల్లోని సంస్కృత పదాలపై దృష్టి నిలపడం వుద్దిష్టాంశం. వాళ్ళ సల్లాపాల్లో అలవోకగా సంస్కృత పదాలు దొర్లుతుంటాయి. కాకపోతే… పద స్వరూపం మారుతుంది. మహాప్రాణాలు మామూలు ప్రాణాలు అవుతాయి (ఖఘఛఠథలు కచటతపలుగా మారుతాయి). సంయుక్తాలు, ద్విరుక్తాలవుతాయి (అగ్ని అగ్గి అవుతుంది). వర్ణవ్యత్యయం, వర్ణసమీకరణాది మార్పులు వస్తాయి. రా వత్తు చాలా సందర్భాల్లో పోతుంది.

ఉదాహరణకు సంస్కృతంలో ‘‘తంత్రి’’ అనే మాటుంది. దీనికి తంతి, నరము, తిప్పతీగ అని అర్థాలు. మరి, మరలా ‘తంతి’ అంటే ఏమిటి? వీణ మొదలైన వాటికి వేసే ఉక్కు కమ్మి అని బహుజనపల్లివారిచ్చిన అర్థం. తెలంగాణలో ఓ దశాబ్దం క్రితం వరకు పల్లెల్లో ‘‘మీ నాయిన చచ్చిపోయిన ముచ్చట బొంబాయిల వున్న మీ అన్నకు తంతి కొట్టిండ్రారా?’’ మోస్తరు వాక్యాలు వినవచ్చేవి. దీనికి అర్థం ఫోన్‌ చేశారా అని. ఇప్పుడంటే వైర్‌లెస్‌ సిస్టమ్‌గానీ మునుపు టెలిఫోన్‌ స్తంభాలు, స్తంభాల్ని కలిపే తీగలు… క్రెడిల్‌, రిసీవర్లు… ఇదీ ఫోన్‌ వ్యవస్థలోని సామాగ్రి. ఫోన్‌ ఆంగ్లం, తంతి సంస్కృతం. అందుకే ఇప్పటికీ ప్రమాణ భాషలో తంతితపాలాశాఖ, తంతి తపాలా కార్యాలయం వంటివే చూస్తాం. తంతి ఎంత చక్కని సంస్కృత పదం!

Also Read:  శ్రీదేవి మరణంలో అనూహ్య మలుపులు..!

‘‘గా నాట్కంల రాజేషం ఏసినోడు తల్వార్‌ మంచిగ తింపిండు. అచ్చం వుద్దెంల ఎట్ల పడ్తరో గట్లనే పట్టిండు’’ వాక్యాల్లోని ‘‘తల్వార్‌’’ సంస్కృత శబ్దం. కాకుంటే దాని మూలరూపం తరవారి. అంటే కత్తి అని అర్థం. పై వాక్యాల్లోని ‘‘వుద్దెం’’ అంటే యుద్ధం. యుద్ధమూ సంస్కృత శబ్దమే! పలకడానికి పదాదిలో వున్న ‘‘యు’’ కాన్న ‘‘వు’’ సులువు.

ఈ ప్రకృతిలో వున్న పర్వతాల గురించి మనకు తెలుసు. గుట్టల్ని తొలిచి మానవుడు తన అవసరాలకు రాళ్ళను వుపయోగించుకున్నాడు. రాతియుగంలోనైతే పనిముట్లు శిలల్లోంచి తయారైనవే! రాళ్ళలో కట్రౌతులు, బెందడిరాళ్ళు, కంకర్రాళ్ళు, హద్దురాళ్ళు, పొడవుగా గజం పరిమాణంలో వుండే కనీలు, పరుపులాగా పరచుకొని వుండే వెడల్పాటి ‘‘సల్వ’’లు… యిట్లా పలురకాలుగా వుంటాయి. వీటిల్లో ‘‘సల్ప’’ సంస్కృత శబ్దమైన ‘‘తల్ప’’భవం. ‘‘తల్పము’’ అంటే దూదిపరుపు అని అర్థం. అట్లా వుండేవే గానీ గట్టిగా వుంటాయి ‘‘సల్పరాళ్ళు’’.

‘‘జెర్ర తాతిపరెంగ పో! కొద్దిగంత తాతిపరెంగ వుండు’’ అనడంలోని తాతిపరెం సంస్కృత తాత్పర్యం నుండి వచ్చింది. తెలుగులో దీనికి అభిప్రాయము అనే అర్థాన్ని నిఘంటువు దఖలు పరిచినా రూఢి మాత్రం సారాంశం అని. తెలంగాణ ‘‘తాతిపరెం’’ పదానికి అర్థం మాత్రం వేరు. ఇక్కడ కొంత నిదానం అని భావం. ఒక భాషలో ఒక అర్థంతో ప్రయుక్తమవుతున్న పదం మరో భాషలో యింకొక అర్థంతో ఉపయుక్తం కావడం మామూలే! ఉదాహరణకు ‘‘దాహం’’ అంటే సంస్కృతంలో కాలడం. తెల్గులో దప్పి. ఇదంతా అర్థవిపరిణామం.

‘‘తిలకం’’ అంటే బొట్టు అనీ, ‘‘తిలకం’’ సంస్కృతం మాట అనీ అందరికీ తెలుసు. తెలంగాణలో తిలకం అంటే ఒకానొకప్పుడు తుమ్మకాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన పదార్థమే! అది కాటుకలాగా నల్లగా తయారయ్యేది. నుదుట పెట్టుకునేటపుడు దాన్ని మాత్రమే ‘‘తిల్కం’’ అనేవాళ్ళు. అర్థ విపరిణామంలో యిది అర్థ సంకోచం అన్న మాట, ‘‘చీర’’లాగా (నన్నయ కాలంలో చీర అంటే వస్త్రం అని అర్థం. ఇవాళది స్త్రీలు కట్టుకొనేది మాత్రమే).

‘‘వాడు మస్తు తీవ్రమ్మీదవున్నడు’’ వాక్యంలోని తీవ్రానికి కోపం అని అర్థం. ఈ తీవ్రమూ అమరమే! ఈ మాటకు ‘‘కోపం’’ అనే అర్థాన్ని నిఘంటువులు చూపించకున్నా తెలంగాణ ప్రజల్లో ఆ అర్థమే వుంది. ‘‘తురుష్కుడు’’ సంస్కృత పదం అని శబ్ద రత్నాకరం చెబుతున్నది. ఇది ‘‘తురక’’ అని తెలుగులో మారింది. ‘‘ఆయనెకు తుర్కం వస్తది’’ అంటే ఉర్దూ భాష తెలుసని అర్థం.

Also Read:  Why 'Skeletons Tumble Out' Of National Rural Employment Guarantee Scheme Cupboard In Telangana?

‘‘తృప్తి’’ అనే సంస్కృత పదం తెలంగాణ ప్రజల్లో ‘‘తుర్తి’’గా వుంది. మొదటి ఋత్వం పోయింది. అయినా ‘‘ఋ’’లోని ఉత్వం వుంది. ఋత్వం పోయి అది హల్లుగా (‘‘రి’’) మారింది. చిత్రంగా ‘‘తృప్తి’’లోని పకారం అసలే లేదు తెలంగాణలో. జానపదులు పదాల్ని యిట్లా మార్చుకుంటారు మరి! వారికి అర్థబోధ ముఖ్యం. భాష వుద్దేశం కూడా అదే! ‘‘తైలికుడు’’ సంస్కృతం. అర్థం గాండ్లవాడు. కొన్ని ప్రాంతాల్లో తేలోల్లు అని కూడా అంటారు. తేల్‌ అంటే నూనె. తిలల్లోంచి వచ్చేదే సంస్కృత తైలం. హిందీ తేల్‌ అని తేలిపోతున్నది. అందుకనే తెలంగాణలో కొందరు తైలికుల్ని తేలోల్లు అని తేల్చి వేశారు. మరి గాండ్ల? ఆ పదం ‘‘గానుగల’’. గానుగు కట్టి నూనె తీసేవాళ్ళు గాండ్లోల్లు.

‘‘దోర్నాలు కుచ్చి తలుపులకు మామిడాకులు పెట్టిండ్రా?’’లోని ‘‘దోర్నాలు’’ సంస్కృత తోరణాలు. కాకతీయ తోరణంలాంటి నిర్మాణాలు ఒక రకం. గుమ్మా నికి మామిడాకుల్ని దారానికి కట్టి వేలాడదీయటం యుంకొక విధం. సంస్కృత తోరణాలు తెలుగులో దోర్నాలు అయినై. తెలంగాణలో మోదుగాకుల్ని దబ్బనంతో గుచ్చి పెద్ద దొంతరగా చేయడమూ దోర్నాలే!

‘‘ఆ పిలగానికి వర్దక్షిణ ఎంత యిస్తున్నరు?’’లోని వర్దక్షిణ- వరదక్షిణే! ఇదీ సంస్కృతమే. సాధారణంగా యితర తెలుగు ప్రాంతాల్లో వరకట్నం అంటారు. ప్రమాణ భాష ప్రభావంతో యివాళ తెలంగాణలోనూ వరకట్నం అంటున్నారు కానీ, పల్లెల్లో చాలామంది వర్దక్షిణ అనే అంటుంటారు.

సంస్కృతంలో ‘‘దధి’’ అంటే పెరుగు. తెలంగాణలో వేసవిలో హోటళ్ళలో ‘‘దైవడ’’ లభ్యమవుతుంది. ఇది నిజానికి దహీవడ. ‘‘దహి’’ హిందీ. దానికి మూలం దధి. అది క్రమంగా తెలంగాణలో ‘‘దై’’ ఐంది. ముప్పదిలోని పది ‘‘ప్పై’’ (ముప్పై) కాలేదా? ‘‘పదిలం’’లోని పది పైలంలో ‘‘పై’’ కాలేదా? ఇవి భాషలో సహజమైన మార్పులు. తెలంగాణలోనూ ‘‘దద్దోజనం’’ అనే మాట వుంది. ఇది దధి భోజనం. పిదప దధియోజనం- దద్యోజనం- దద్దోజనం.

‘‘దశకం’’ అంటే పది. దశకం సంస్కృతం. తెలంగాణలో తీసివేతలో ఈ దశకం దస్కం అని వాడబడుతుంది. ఉదాహరణకు ముప్పై అనే సంఖ్య నుండి పందొమ్మిది తీసివేయాలి అనుకున్నప్పుడు- ముప్పైలో చివరి సున్నా నుండి పందొమ్మిదిలోని చివరి తొమ్మిది పోదు కనుక ‘‘దస్కం తెచ్చుకోండి పక్కన వున్న మూడులకెల్లి’’ అంటారు. అప్పుడు ఆ పదిలోంచి పందొమ్మిదిలోని తొమ్మిది తీసివేసి ఒకటి వేసి లెక్క పూర్తి చేస్తారు. అది గణితపరమైన లెక్క. భాషాపరమైన లెక్క ఏమిటంటే, సంస్కృత ‘‘దశకం’’ తెలంగాణలో ‘‘దస్కం’’ అవుతుందనీ, శకారం సకారం అయినా వికారం లేదనీ, పైగా ‘‘స్క’’ అనే సంయుక్తం సముచితంగానే యుక్తంగానే తయారవుతుందనీనూ!

Also Read:  జిల్లా కేంద్ర ఎమ్మెల్యేగా పనిచేయాలని జనగామ 'ముత్తిరెడ్డి'కి 'ఎర్రబెల్లి' పొగ - పోటీకి ఎర్రబెల్లి సై, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి

‘‘పొద్దున చచ్చిపోయిండు. ఇప్పుడే దానం అయింది. కొడుకులు బిడ్డలు అందరు సైమానికి అందిండ్రు’’ అనే వాక్యాల్లోని ‘‘దానం’’ సంస్కృతం ‘‘దహనం’’ పదం నుండి వచ్చింది. దహనం అంటే కాలేయడం, దహన సంస్కారాలు కావించడం. సంస్కృత ‘‘దహనం’’ తెలంగాణ ‘‘దానం’’ అయ్యింది.

ఇక ‘‘దారుణం’’ ముచ్చట. అర్థం భయంకరం అని. వాస్తవంగా జరుగరాని ఘోరం ఏదో జరిగినప్పుడు ‘‘ఎంత దారుణం?’’ అంటారు ఆధునిక ప్రమాణ భాషలో. తెలంగాణలో దారుణం ‘‘దార్నం’’ అయింది. అంతే కాదు, అర్థం మారింది. ‘‘వానిది దార్నం పెయ్యి’’ అంటుంటారు. అంటే వేడి శరీరం అని. అరచేతుల్లో పైచర్మం పగుళ్ళువారినా, పైపొట్టు వంటిది లేచినా ‘‘దార్నం అయింది’’ అంటారు. అంటే వేడి వల్ల అలా పరిణమించింది అని. ఇక్కడ భయంకరం అనే అర్థం పోయి ‘‘వేడి’’ అనే అర్థం స్థిరపడింది. వేడి కావటం కూడా ఓ రకమైన భయంకరమే కదా!

‘‘దినం’’ సంస్కృతం. దీనికి దివసం, పగలు అర్థాలు. తెలంగాణలో ‘‘దినాలు ఎప్పుడు?’’ అంటే మాత్రం ప్రత్యేకమైన దినాలు. చనిపోయినవారికి చేసే దశదినకర్మలు మొదలైనవి (కొందరు పదకొండు, పన్నెడు రోజుల్లో చేస్తారు- మరికొందరు ఐదు రోజుల్లో ముగిస్తారు. ఇన్ని రోజుల్లో చేయాలన్న కచ్చిత నియమం లేనట్లుంది). ‘‘నీ దినాలు గాను’’ అనే తిట్టూ వుంది. దినాలే కాకుండా ‘‘దినవారాలు’’ అనే సమాస ప్రయోగమూ వుంది. నిజామాబాదు ప్రాంతాల్లో ‘‘దెవ్సాలు ఎప్పుడు’’ అంటారు. ఇందులోని ‘‘దెవ్సాలు’’ సంస్కృత ‘‘దివసాలు’’. ఇవీ దినవారాల్లాంటివే! ‘‘వానికి నేను దినాం చెప్తున్న. ఇంటనే లేడు’’ అనటంలోని ‘‘దినాం’’ అంటే దినదినం, అనుదినం, ప్రతిదినం అని అర్థం. ఇదే అర్థంలో ‘‘నిత్తె చెప్తున్న’’ అంటుంటారు. అంటే నిత్యం అని అర్థం. ప్రతి రోజూ అని. నిత్తెలో నిత్యంలోని సున్నా లోపించింది. ఇది కన్నడ ప్రభావం. పైగా ‘‘నిత్తె’’లో చివర ఎకారం వుంది. అదీ కన్నడ ప్రభావమే! కన్నడ ఆదికవి పంపను పోషించిందీ తెలంగాణనే కదా! (వేములవాడ చాళుక్యరాజు రెండవ అరికేసరి).

‘‘ఏ… ఆయినె దీక్ష తీసుకున్నడు. తిను తాగు అని బలవంతం చెయ్యకుండ్రి’’లోని ‘‘దీక్ష’’ సంస్కృతం. ‘‘దీపావళి’’ చిత్రంగా ‘‘దీలె’’, ‘‘దివిలె’’ లోనగు రూపాలు మారివుంటుంది. అయితేనేం… దీపాలవుతే వుంటాయి. ‘‘దీర్ఘము’’ అంటే నిడుద, ఆయతం అని అర్థాలు. ‘‘వీడు ప్రతిదానికి దీర్గం తీసి చెప్తడు’’ అంటే సాగదీస్తాడు అని అర్థం. ఇక… ‘‘దుఃఖం’’ తెలంగాణలో ‘‘దుక్కం’’ అయితుంది (దుక్కం లేనోడు బర్రెను కొనుక్కున్నట్లు- అని ఒక సామెత).

ఈ విధంగా సంస్కృత భాషా పరిష్వంగంతో తెలగాణ పదం ముదమార పరవశించింది. #KhabarLive

PropellerAds

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here