తెలంగాణలో కేబినెట్ లో మార్పులు చేర్పులు ఖాయంగా కనబడుతున్నది. గత పదిరోజులుగా సిఎం కేసిఆర్ తన గజ్వెల్ లోని ఫామ్ హౌస్ లో కేబినెట్ మార్పులపై కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వార్త టిఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. అయితే కేబినెట్ మార్పులు చేర్పులు అనగానే.. ఎవరికి బెర్త్ దక్కుతుంది? ఎవరి పదవి ఊడుతుంది అన్నది హాట్ న్యూస్ అయింది. కేబినెట్ మార్పులో భాగంగా ఒక మహిళకు మాత్రం గ్యారెంటీగా మంత్రి పదవి దక్కొచ్చన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.

అయితే తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి ఏర్పాటైన కేబినెట్ ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. ఉపముఖ్యమంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్యను మాత్రం అనూహ్యంగా బర్తరఫ్ చేసి ఆయన స్థానంలో కడియం శ్రీహరిని నియమించారు. మిగతాదంతా సేమ్ టు సేమ అలాగే ఉంది. అయితే గత కొంతకాలంగా కేబినెట్ లో మార్పులు చేర్పులు అని ప్రచారం సాగింది. రేపు.. మాపు అంటూ ఆశావహులు ఎదురుచూశారు. కానీ సిఎం కేసిఆర్ తన టీం ను మార్చేందుకు ఇష్టపడలేదు. పైగా ఇటీవల కాలంలో ఎపిలో సిఎం చంద్రబాబు చేసిన కేబినెట్ విస్తరణ రచ్చ రచ్చ అయింది. కొందరు నేతలు బజారుకెక్కి అసంతృప్తిని వెల్లగక్కారు. ఈ పరిణామం కూడా కేసిఆర్ మీద ఎఫెక్ట్ చూపినట్లు అప్పట్లో చర్చ జరిగింది.

ALSO READ:  The Fastest Growing 'Mehfil-E-Sher' Market Of India

అయితే తెలంగాణ తొలి కేబినెట్ కూర్పులో మహిళకు స్థానం లేకపోవడంపై తొలినుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొన్న జరిగిన మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనేందుకు మహిళా మంత్రులెవరూ లేకపోవడం వెలితిగా ఉందని పార్టీ నేతలు కూడా చర్చించుకున్నారు. ఈ పరిస్థితుల్లో కేబినెట్ లో మార్పులకు కేసిఆర్ కసరత్తు షురూ చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఉండేవెవరు? పోయేదెవరు అన్నదానిపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే సిఎం కేసిఆర్ పలువురి పేర్లను పరిశీలించారని, వారి తాలూకు పనితీరును, వారి నియోజకవర్గాల్లో చేసిన సర్వే ఫలితాలను పరిశీలించినట్లు చెబుతున్నారు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొత్తగా కేబినెట్ లో ప్రస్తుత స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డిల పేర్లను పరిశీలించినట్లు చెబుతున్నారు. అయితే స్వామి గౌడ్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయన స్థానంలో మండలి ఛైర్మన్ గా నారదాసు లక్ష్మణరావును నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. స్పీకర్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయన స్థానంలో వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టే అవకాశం ఉన్నట్లు చెబతున్నారు. డిప్యూటీ స్పీకర్ గా చీఫ్ విప్ గా ఉన్న కొప్పుల ఈశ్వర్ ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కొండా సురేఖ స్పీకర్ గా చేయకపోతే ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని చెబుతున్నారు. ఆమెకు అయితే స్పీకర్ లేదంటే.. మంత్రి పదవి గ్యారెంటీగా రావొచ్చంటున్నారు. ఆమెపాటు మహిళా కోటాలో కోవా లక్ష్మి, రేఖా నాయక్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. కొండా సురేఖ స్పీకర్ అయినా, మంత్రివర్గంలోకి తీసుకున్నా.. వీరిద్దరిలో ఒకరికి బెర్త్ ఖాయమని చర్చ జరుగుతోంది.

ALSO READ:  On 'International Day Of Peace' 2018, India Divergent On Crossroads?

ఇక మంత్రివర్గం నుంచి ఎవరిని తప్పిస్తారన్న విషయంలో ఆసక్తికరమైన సమాచారం అందుతోంది. గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్న చందూలాల్ ను తొలగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆయనపై అనేక సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. పైగా ఆయన ఆరోగ్యం అంతగా సహకరించడంలేదన్న చర్చ కూడా ఉంది. దీంతో ఆయనను తప్పించే చాన్స్ ఉందంటున్నారు. చందూలాల్ కు అవసరమైతే రాజ్యసభ ఇస్తారని కూడా చెబుతున్నారు.

ఇక హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పైనా వేటు తప్పదని ప్రచారం సాగుతోంది. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించి రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం ఇప్పటికే మొదలైంది. ఇక హైదరాబాద్ మంత్రి పద్మారావును సైతం తప్పించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. పద్మారావు గౌడ్ పనితీరు పట్ల సిఎం అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే పద్మారావు గౌడ్ కు టిఆర్ఎస్ పార్టీలో కీలకమైన పదవి ఇస్తారని కూడా చెబుతున్నారు.

ALSO READ:  #TelanganaLegend 'Madadi Ravinder Reddy' In A 'Class Of His Own'

ఇక జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిపైనా వేటు తప్పదని చెబుతున్నారు. ఆయన పనితీరు పట్ల సిఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడంలో లక్ష్మారెడ్డి విఫలమైనట్లు ప్రచారం సాగుతోంది. ఈ నలుగురు మంత్రులకు ఉధ్వాసన పలికితే మరో నలుగురు కొత్త వారికి చాన్స్ ఉంటుందని చెబుతున్నారు. సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. #KhabarLive