తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో రానున్న రాజకీయ పార్టీ పేరు ఖరారైంది. ‘తెలంగాణ జన సమితి’ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కోదండరాం సిద్ధమవుతున్నారు. పార్టీ పేరుతో పాటు జెండా, అజెండా వివరాలను ఏప్రిల్‌ 2న స్వయంగా ప్రకటించనున్నారు. పార్టీ చిహ్నాలకు సంబంధించి మూడు నమూనాలను ఇప్పటికే రూపొందించారు.

2న నిర్వహించే సమావేశంలో వీటిని వెల్లడించి ప్రజల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. 4న పార్టీ జెండాను, పోస్టర్‌ను ఆవిష్కరిస్తారు. ఏప్రిల్‌ 29న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు దృష్టిపెట్టారు. ఐకాస ఛైర్మన్‌ పార్టీ పెట్టబోతున్నారని చాలాకాలంగానే వూహాగానాలు వినిపించినా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కసరత్తు మూడు, నాలుగు నెలలకు ముందునుంచే సాగుతోంది. మూడు, నాలుగు పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినతర్వాత రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు కోదండరాం నెలరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా తెలంగాణ ఐకాస కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ALSO READ:  Over 1000 Farmer Suicides Occured In KCR Regime In Telangana!

గ్రామగ్రామానికి జనసమితి: పార్టీ పేరు తెలంగాణ జన సమితిగా ఖరారైందని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం వచ్చిందని కోదండరాం సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. ఈసీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే సన్నాహాలను కోదండరాం ముమ్మరం చేశారు. పార్టీ పతాకంలో పాలపిట్ట, ఆకుపచ్చ రంగు ప్రధానంగా ఉంటాయి. మధ్యలో తెల్లరంగు ఉంటుంది. అమరవీరులు, కార్మికులు, రైతుల చిహ్నాలతో నమూనాలు ఉన్నట్లు సమాచారం. చిహ్నాల్లో అమరవీరుల స్థూపం దానిచుట్టూ బతుకమ్మ ఆడటం వంటివి ఉన్నట్లు తెలిసింది. సామాజిక న్యాయం, రైతాంగం, నిరుద్యోగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని పోరాటం చేయాలని ‘తెలంగాణ జన సమితి’ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ చిహ్నాలకు సంబంధించిన మూడు నమూనాలపై వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలు తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన దాన్ని 4వతేదీన ప్రకటించే అవకాశముంది.

ALSO READ:  Can India Afford 'Online Food Orders' And 'Takeaways'?

జ్యోతిబాపూలే, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌, కొమురం భీమ్‌, ఆచార్య జయశంకర్‌ల స్ఫూర్తితో.. తెలంగాణ సకలజనుల, సబ్బండవర్గాల పక్షాన ఉద్యమ ఆకాంక్షలు, అమరుల ఆశయాల సాధనకు కోదండరాం నాయకత్వంలో.. ‘తెలంగాణ జన సమితి’ పార్టీని తీసుకువస్తున్నట్లు ఐకాస పేర్కొంది.

బహిరంగ సభ కోసం హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌, ఎల్‌బీస్టేడియం, నిజాం కళాశాల, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం, ఎన్టీఆర్‌ స్టేడియంను ఐకాస నేతలు పరిశీలిస్తున్నారు. పోలీసులు వీటిలో ఎక్కడ అనుమతిస్తే అక్కడ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 29న జరిగే బహిరంగసభలో ఇతర పార్టీల నుంచి ‘తెలంగాణ జన సమితి’లోకి పెద్దఎత్తున చేరికలు ఉండే అవకాశముందని ఐకాస వర్గాలు భావిస్తున్నాయి. #KhabarLive