కల్యాణలక్ష్మి/ షాదీముబారక్‌ పథకం కింద ఆడపిల్ల పెళ్లి కోసం అందించే ఆర్థిక సహాయం మొత్తాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116కు పెంచుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ఆడపిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచే కాకుండా సమాజ హితం కోరే వారందరి నుంచి హర్షామోదాలు లభిస్తాయని విశ్వసిస్తున్నానన్నారు.

ఆర్థిక సహాయం పెంపుపై ఆయన సోమవారం శాసనసభలో ప్రకటన చేశారు.‘ఆడపిల్లల కన్నీరు తుడిచి వారి తలపై కల్యాణ అక్షింతలు చల్లిన ఈ పథకాన్ని 2014 అక్టోబరు 2వ తేదీన ప్రవేశపెట్టాం. కల్యాణలక్ష్మి వ్యక్తిగతంగా నా హృదయానికి ఎంతో దగ్గరైన పథకం. అంతకంటే ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చిన.. అమ్మాయిల కళ్లల్లో ఆనందం నింపిన పథకం. మొదట దీన్ని కల్యాణలక్ష్మి పేరుతో ఎస్సీ, ఎస్టీలకు, షాదీముబారక్‌ పేరుతో మైనారిటీ వర్గాల ఆడపిల్లల పెళ్లికి రూ.51 వేలు ఇచ్చేలా ప్రారంభించాం.

ALSO READ:  Groundnuts Crushing Industry Turns Around Lives At Wanaparthy In Telangana

ఆ తరువాత ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు సామాజిక వర్గంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపజేశాం. ఈ పథకం ప్రయోజనం మరింత పెంచాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం మొత్తాన్ని గత ఏడాది రూ.75,116కు పెంచాం. ఇప్పటివరకు దీని కింద 3.60 లక్షల మందికి లబ్ధి చేకూరింది. లబ్ధి పొందడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలుగా నిర్ణయించాం. దీనివల్ల బాల్య వివాహాలు చేయకుండా 18 ఏళ్లు నిండే వరకు తల్లిదండ్రులు వేచి ఉంటున్నారు. అంటే బాల్య వివాహాలను నిరోధించడానికి కూడా ఈ పథకం ఉపయోగపడుతోంది. సహాయం అందుకున్న వివాహాలకు ప్రభుత్వ గుర్తింపుతోపాటు చట్టబద్ధత లభిస్తోంది. ఇది ఈ పథకం సాధించిన మరో ప్రయోజనం.

కల్యాణలక్ష్మి సహాయం పెరిగింది. ఏప్రిల్‌ 1 తర్వాత వివాహం చేసుకునే పేదింటి ఆడపిల్లలకు షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాల కింద ప్రభుత్వం రూ.1,00,116 ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం శాసనసభలో అధికారికగా ప్రకటన చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కల్యాణలక్ష్మి బడ్జెట్‌ కేటాయింపులను ప్రభుత్వం భారీగా పెంచింది. 2017-18లో రూ.850 కోట్లు పేర్కొంటే, 2018-19 సంవత్సరానికి ఏకంగా రూ.1,450 కోట్లకు పెంచింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద సాయాన్ని రెండింతలు చేయాలంటూ గతేడాది సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాయి.

ALSO READ:  The Dramatic Rise In Wealth Inequality In India

అయితే సర్కారు గతేడాదికి రూ.51,000 నుంచి రూ.75,116కి పెంచింది. మరింత పెంచాలంటూ ప్రజాప్రతినిధులు కూడా కోరడంతో సాయం పెంచాలని ప్రభుత్వం మూడు నెలల క్రితమే నిర్ణయించింది. అయితే దీన్ని బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటిస్తారని అందరూ భావించారు. బడ్జెట్‌ ప్రసంగంలో లేకపోవడంతో తెలంగాణ ఆవిర్భావం రోజున ప్రకటిస్తారనుకున్నారు. అయితే ఏప్రిల్‌ 1 నుంచి అధికారికంగా పెంపు అమల్లోకి వస్తుందని సీఎం సోమవారం శాసనసభలో ప్రకటించారు.

2.87 లక్షల మందికి సహాయం
కల్యాణలక్ష్మి కింద ప్రభుత్వం చేసిన కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటే గరిష్ఠంగా 1.44 లక్షల మందికి సాయం అందే వీలుంది. బడ్జెట్‌లో రూ.1450 కోట్లు కేటాయించడంతో పాత సహాయం (రూ.75,116) కింద కనీసం 1.93 లక్షల మందికి సహాయం అందేది. కానీ రూ.1,00,116కి పెంచడంతో 1.44 లక్షల మందికే ఈ నిధులు సరిపోతాయి. పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 3.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించి 2.87 లక్షల మందికి రూ.1,608 కోట్లు విడుదల చేశారు. 2018-19 ఒక్కఏడాదిలోనే రూ.1450 కోట్లు ఈ పథకం కింద కేటాయించడం విశేషం. #KhabarLive