నాటి ఆది మానవుడికి ప్రస్తుత మనిషికి స్పష్టమైన తేడాకు వారధిగా నిలిచింది చదువు. అవును ఆ చదువు వల్లనే ఇంతటి అభివృద్ది, సౌకర్యాలు.. ఆ చదువు వల్లనే మట్టి పిసుక్కుంటూ పెంకులు తయారుచేసిన కొడవళ్ళ హనుమంతరావు గారు అమెరికా మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగం పొందారు. తనని ఇంతటి స్థాయికి తీసుకువచ్చిన ఆ చదువునే అందరికి చేరువచేయాలనే ఆశయంతో కోట్లు ఖర్చు పెట్టి లైబ్రరీలను నిర్మిస్తున్నారు.

రోజుకు రూపాయి జీతంతో.. ప్రకాశం జిల్లా రావినూతల అనే గ్రామం వీరి స్వస్థలం. నాన్న వెంకటేశ్వర్లు గారు అంతగా చదువుకోకపోవడంతో కుండలు, ఇళ్ళ కోసం పెంకులు తయారు చేసేవారు. హనుమంతరావు గారు కిలోమీటర్ల దూరం నడిచి పాఠశాలకు వెళుతూనే ఖాళీ సమయాల్లో నాన్న చేసే పనికి తన చిన్ని చేతులతో సహాయాన్ని అందించేవారు. “ఖాళీ సమయాల్లో మాత్రమే అనుమతిస్తున్నాను, నీ లక్ష్యం, గమనం చదువు మీద మాత్రమే ఉండాలి” అని తండ్రి మాటలతో ఒక నిర్ధిష్టమైన మార్గాన్ని నిర్మించుకున్నారు. అలా పనిచేస్తూనే వేసవి సేలవుల్లో వ్యవసాయ పనులకూ వెళ్ళేవారు. అందులో వచ్చే రోజుకు రూపాయి జీతంతో పుస్తకాలు, పెన్సిళ్ళు లాంటివి కొనుగోళ్ళు చేసేవారు.

ALSO READ:  Why The 'Mighty Women' Always Tried To Rule Over 'City Of Pearls' - Hyderabad?

పుస్తకాల కోసం ఎన్నో ఇబ్బందులు: హనుమంతరావు గారి ప్రయాణం గతుకుల రోడ్డు మీద సాగింది అందుకే ఆ మార్గాన్ని పున:నిర్మించాలనే కోరిక కలిగింది. చిన్నతనంలో తను సబ్జెక్ట్ రిలేటడ్ బుక్స్ తో పాటు ఇతర కాంపిటీటివ్ పుస్తకాలను కూడా చదువుకోవాలని తపించారు కాని ఎక్కడా కూడా సరైన గ్రంథాలయాలు లేకపోవడంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఆ ఇబ్బందుల కన్నా తన సంకల్ప బలం గొప్పది కావడంతో తను ఊహించిన స్థాయికే చేరుకున్నారు.

మొదటి లైబ్రెరి: అమెరికా మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం రావడం, అక్కడే స్థిరపడిపోతే ఆయన గురించి బహుశా మనం ఈరోజు చెప్పుకోకపోయి ఉండవచ్చు. ఎక్కడ ఉన్నా, ఎంత స్థాయిలో ఉన్నా తన జీవన ప్రయాణం, తాను ఎదుర్కున్న ఇబ్బందులే కళ్ళముందు కదలాడుతూ ఉండేవి. నేను పడ్డ కష్టాలు మరెవరూ పడకూడదని మొదటిసారి పది సంవత్సరాల క్రితమే తనకు జన్మనిచ్చిన గ్రామంలోనే 50 లక్షలు ఖర్చుచేసి భావితరాలను తయారుచేసే అందమైన లైబ్రెరి తండ్రి పేరుతో నిర్మించారు. కేవలం నిర్మాణం వరకే కాకుండా సిబ్బంది జీతాలు, కొత్త పుస్తకాలు ఇలాంటి అవసరాలన్నీ హనుమంతరావు గారే చూసుకుంటారు.

ALSO READ:  Why Popular 'Ajanta Caves' Paintings Of 'Nizam Era' Lies In Neglect?

ప్రతిరోజు న్యూస్ పేపర్లతో పాటుగా కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పుస్తకాలు, చరిత్రకు సంబందించినవి, పిల్లల సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం ఇలా ప్రతి రంగానికి అవసరమయ్యే వేల పుస్తకాలతో హనుమంతరావు గారు ఇప్పటివరకు 30 గ్రంథాలయాలను నిర్మించి మరిన్ని నిర్మించడానికి సన్నద్ధం అవుతున్నారు ఈ అక్షర సేవకుడు. #KhabarLive


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.