“ఎంపీల రాజీనామా ప్రకటనతో ప్రజలలో మా పార్టీ గ్రాఫ్‌ పెరిగింది” అని వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించగా, ఆ పార్టీకి కౌంటర్‌గా “ఏప్రిల్‌ ఆరో తేదీ లోపే మేము ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం” అని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు చెప్పుకొచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేస్తున్న విషయం పక్కకు పోయి రాజకీయం రంగప్రవేశం చేసినట్టయింది. ఎంపీలు రాజీనామా చేసినంత మాత్రాన, కేంద్ర మంత్రిమండలి నుంచి తెలుగుదేశం మంత్రులు వైదొలిగినంత మాత్రాన, లేదా భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం తెగదెంపులు చేసుకున్నంత మాత్రాన రాష్ర్టానికి న్యాయం జరుగుతుందా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.

ఏప్రిల్‌ 5వ తేదీలోపు కేంద్రం దిగివచ్చి రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలు ఆరో తేదీన రాజీనామాలు చేస్తారని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి ముందుగా ప్రకటించి రాజకీయానికి తెర లేపారు. రాజీనామాలకు ఏప్రిల్‌ ఆరో తేదీని ఎంచుకోవడంలోనే రాజకీయం ఉందనుకోండి! ఎందుకంటే పార్లమెంట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 5తో ముగుస్తాయి. ఆ తర్వాత ఎంపీలు ఎవరైనా రాజీనామాలు చేసినా మళ్లీ ఆగస్టు నెలలో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పుడే సదరు రాజీనామాలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారు.

ఒకవేళ అప్పుడు రాజీనామాలు ఆమోదించినా ఎన్నికలకు ఆరేడు మాసాల వ్యవధి మాత్రమే ఉంటుంది కనుక ఉప ఎన్నికలు జరగవు. రాజీనామాలు చేయాలనుకుంటే ఏప్రిల్‌ అయిదులోపు పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడే చేయవచ్చు. అలా చేస్తే వెంటనే రాజీనామాలు ఆమోదం పొందే అవకాశం లేకపోలేదు. లెక్కలన్నీ వేసుకుని సరిచూసుకున్న తర్వాతే జగన్మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ ఆరును ఎంచుకున్నారని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోయిందని వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సహజంగానే సంబరపడిపోతున్నారు. దీంతో మామూలుగానే ఆవేశపరుడైన మంత్రి ఆదినారాయణరెడ్డి ‘‘మీ డెడ్‌లైన్‌ ఏప్రిల్‌ ఆరు అయితే మా పార్టీ డెడ్‌లైన్‌ మార్చి అయిదే! అప్పటికల్లా రాష్ర్టానికి న్యాయం చేయకపోతే కేంద్రం నుంచి మా పార్టీ మంత్రులు వైదొలుగుతారు’’ అని చెప్పుకొచ్చారు.

నిజానికి ఈ రాజీనామాలు, డెడ్‌లైన్‌ ప్రకటనలన్నీ రాజకీయ క్రీడలో భాగమే! ఈ కారణంగానే మరుగునపడిపోయిన ప్రత్యేక హోదా అంశాన్ని జగన్మోహన్‌రెడ్డి మళ్లీ తెర మీదకు తెచ్చారు. రాజీనామాలతో ప్రత్యేక హోదా రాదని అందరికీ తెలుసు. అలా అయితే రాష్ట్ర విభజన 2014 కంటే ముందే జరిగేది లేదా ఆగిపోయి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయనందుకు నిరసనగా అప్పట్లో కేంద్ర మంత్రి పదవులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆలె నరేంద్ర రాజీనామాలు చేశారు. కేసీఆర్‌ అయితే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లారు. తమ పార్టీ శాసనసభ్యులతో రెండు పర్యాయాలు రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలను ఎదుర్కొని చేదు అనుభవాలను కూడా చవిచూశారు. కేంద్ర మంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేసినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామా పత్రాలు ఇచ్చినంత మాత్రాన విభజన ఆగిపోలేదు.

ఆనాడు విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసినవారిలో జగన్మోహన్‌రెడ్డి కూడా ఉన్నారు. అప్పుడు వారు చేసిన రాజీనామాలు కూడా ఆమోదం పొందలేదు. రాజకీయంగా తప్పదనుకున్నప్పుడే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించింది. ఇది చరిత్ర! ఇప్పుడు వర్తమానంలోకి వస్తే, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా గెలిచే బలం లేదు. తెలుగుదేశం– వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే పోరు కేంద్రీకృతమైనందున ఎవరో ఒకరితో జత కట్టడం మినహా బీజేపీకి ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని కాదనుకుని ఎన్నికలకు ముందే వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు తక్కువ. అలా జరిగితే తెలుగుదేశం పార్టీ లాభపడుతుంది. అందుకే ఎన్నికల తర్వాత ‘మనం మనం ఒక్కటే’ అన్న అభిప్రాయానికి బీజేపీ–వైసీపీ నాయకులు వచ్చారన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

ఈ ప్రచారం నిజమైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా నరేంద్ర మోదీ– అమిత్‌ షా ద్వయం బేఖాతరు చేయవచ్చు. అలా కాకుండా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతోనే కలిసి ఉండాలని వారు ఇరువురూ నిర్ణయం తీసుకుంటే రాష్ర్టానికి కొంతవరకైనా న్యాయం చేయడానికి అంగీకరిస్తారు. ఏపీలో నష్టపోయినా తెలంగాణలోనైనా రాజకీయంగా లాభం పొందవచ్చునన్న ఉద్దేశంతోనే నాడు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుంది. తెలంగాణలో కూడా అధికారంలోకి రావడం లేదని తెలిస్తే కాంగ్రెస్‌ వైఖరి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, వైసీపీ ఎన్ని ఎత్తులు– పైఎత్తులు వేసినా భారతీయ జనతా పార్టీ ఎవరివైపు మొగ్గుతుందనేదే ముఖ్యం.

ALSO READ:  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ్యత్వ రద్దు గెజిట్, రాజపత్రం విడుదల చేసిన అసెంబ్లీ

ఎన్నికల తర్వాత వైసీపీ మద్దతు పొందడమా? లేక ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లడమా? అన్నది బీజేపీ నిర్ణయం తీసుకోవలసి ఉంది. జాతీయ స్థాయిలో వెల్లడవుతున్న సర్వే వివరాలను బట్టి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలుకుబడి సన్నగిల్లుతోంది. దీన్నిబట్టి సాధారణ ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే ఇతరుల మద్దతు బీజేపీకి అవసరం. ఆ ఇతరులు ఎవరనేదే ఇప్పుడు తేలవలసి ఉంది. ఏపీలో మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 25 మాత్రమే! ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ అన్న విషయం పక్కనపెడితే తెలుగుదేశం, వైసీపీ ఈ 25 స్థానాలనే పంచుకోవలసి ఉంటుంది. ఈ 25 స్థానాలలో గరిష్ఠంగా సీట్లను పొందిన పార్టీ ఎన్నికల తర్వాత కీలకంగా మారుతుంది. ఈ నేప థ్యంలోనే ఎంపీల రాజీనామా ప్రకటన చేసి ప్రజలలో మైలేజీ పొందడానికి జగన్మోహన్‌రెడ్డి వ్యూహరచన చేశారు.

రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేస్తారని ప్రకటించిన జగన్మోహన్‌రెడ్డి, రాజ్యసభలో తమ ప్రతినిధి విజయసాయిరెడ్డి రాజీనామా గురించి మాత్రం చెప్పలేదు. లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేసినా విజయసాయిరెడ్డి మాత్రం రాజీనామా చేయరట! ఎందుకంటే ఆయన రాజీనామా ఆమోదం పొందితే ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. అయినా ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి మాత్రమే ఉన్నప్పుడు రాజీనామాలు చేయడం అన్నది నిరర్థకం! సభలో ఉండి పోరాడాల్సిన వారు రాజీనామాలు చేసి తప్పుకొంటే కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ముక్తకంఠంతో శపిస్తున్న విషయం వాస్తవం. ఇది గమనించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా సహచర మంత్రులు పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌తో మాట్లాడుతూ, ‘జమ్మూకశ్మీర్‌, తమిళనాడు రాష్ర్టాలు ఇప్పటికే ఢిల్లీకి దూరమయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ కూడా చేరకుండా ఉండాలంటే మీ శాఖలకు సంబంధించిన విషయాలలో ఎంతో కొంత చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా నచ్చజెప్పండి’ అని సూచించారట!

ఈ నేపథ్యంలో మళ్లీ మార్చి అయిదున పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు సానుకూల ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉండలేదు. ఎందుకంటే వైసీపీ అనుసరిస్తున్న ఎత్తుగడల వల్ల తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ కారణంగా తెలుగుదేశం నాయకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం విషయంలో దూకుడుగా వ్యవహరించాలని ఒక వర్గం అభిప్రాయపడుతుండగా, మరో వర్గం దూకుడు వద్దని వారిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి న్యాయం చేస్తుందన్న నమ్మకం ప్రజలలో కలగనంతవరకు తెలుగుదేశం–బీజేపీ మధ్య బంధం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఎంతో చేసిందని చెప్పడానికి బీజేపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు రెండు దఫాలుగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, రాష్ర్టానికి ‘అవి చేశాం– ఇవి చేశాం’ అని చెప్పుకొచ్చారు. అయితే వారు చెబుతున్న విషయాలను ఆలకించే పరిస్థితులలో రాష్ట్ర ప్రజలు లేరు. తమకు అన్యాయం జరిగిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ప్రజలలో ఈ అభిప్రాయం పోవాలంటే ప్రత్యేక ప్యాకేజీ కింద ఏమి చేస్తారనే దానిపై విస్పష్ట ప్రకటన మాత్రమే చేయవలసి ఉంటుంది. లేనిపక్షంలో రాష్ట్ర ప్రజల దృష్టిలో బీజేపీ దోషిగా మిగిలిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్ర సహాయం తప్పనిసరి.

కేంద్రంతో మనకేమి అవసరం– పశ్చిమ బెంగాల్‌, కేరళ వంటి రాష్ర్టాలు కేంద్రంతో సఖ్యతగా లేకపోయినా మనుగడ సాగించడం లేదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆవేశంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. పశ్చిమ బెంగాల్‌, కేరళ వంటి రాష్ర్టాలు కొత్తగా ఏర్పడినవి కావు. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అలా కాదు. రాజధాని కూడా లేకుండా ఆర్థిక లోటులో మునిగిన రాష్ట్రం ఇది! అంతేకాదు– పిండి కొద్దీ రొట్టె అని సరిపెట్టుకునే మనస్తత్వం ఉన్న ప్రజలు కాదు ఆంధ్రులు. పొరుగు రాష్ర్టాలతో దీటుగా తలెత్తుకుని బతకాలనే కోరుకుంటారు. గతంలో ఏర్పాటైన ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ వంటి వెనుకబడిన ప్రాంతం కాదు సీమాంధ్ర. అక్కడి ప్రజలతో ఇక్కడి ప్రజలను పోల్చలేం. ఆంధ్రప్రదేశ్‌ పేద రాష్ట్రమైనా ప్రజలు పేదవాళ్లు కాదు. ఇప్పటిదాకా హైదరాబాద్‌తో అనుబంధం ఏర్పర చుకున్న కారణంగా తమకు కూడా అలాంటి రాజధానే ఉండాలని కోరుకుంటారు. మిగతా దక్షిణాది రాష్ర్టాలతో దీటుగా తాము కూడా నిలబడాలని ఆశిస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ర్టాలు అక్కడి ప్రజల ఇష్టం మేరకు విడిపోయాయి. ఈ కారణంగా తమకు అది కావాలి, ఇది కావాలి అని వారు పెద్దగా కోరుకోలేదు. ఏపీ అలా కాదే! ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఏర్పడిన రాష్ట్రం.

ALSO READ:  'Barkas Health Centre' Suffers 'Dearth Of Doctors' Despite 'Top Amenities' In Hyderabad

హైదరాబాద్‌లో ఉన్న వసతులు, సంస్థలు తమకు కూడా కావాలని కోరుకుంటారు. ఈ కారణంగానే ఎప్పుడో ఏర్పడిన రాష్ర్టాలకు ఇంకా ఇవ్వని వాటిని కూడా ఈ నాలుగేళ్లలోనే ఏపీకి ఇచ్చామని బీజేపీ నాయకులు చెబుతున్నా ప్రజలు సంతృప్తి చెందడం లేదు. ఏపీలో ఉన్న రాజకీయపక్షాలేవీ కూడా రాష్ట్ర విభజనను కోరుకోలేదు. ఈ అంశాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం విధిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇంతకుముందు ఏర్పాటుచేసిన రాష్ర్టాలతో పోల్చిచూడటం ఏ మాత్రం సమర్థనీయం కాదు. మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటే సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుంది. గతంలో ఏర్పడిన రాష్ర్టాలలో జాతీయ పార్టీల ప్రాబల్యం ఉంది. ఏపీలో అలా కాదు. రెండు ప్రాంతీయ పార్టీలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. ఈ కారణంగా ప్రజాప్రయోజనాలు– రాజకీయ ప్రయోజనాలు మిళితం అయ్యాయి. ఇవేమీ గమనించకుండా ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీలను మంచం కింద ఒకరిని, తలుపు చాటున ఒకరిని దాచిపెట్టి కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడదామనుకుంటే అది ఎంత మాత్రం క్షంతవ్యం కాదు.

‘రాజకీయ పార్టీలు ఏ గంగలో కలిస్తే మాకెందుకు? మా సంగతి మాకు ముఖ్యం’ అని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ప్రతిపక్షం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానో, ప్రజలలో నెలకొన్న ఆగ్రహావేశాలను దృష్టిలో పెట్టుకునో తెలుగుదేశం పార్టీ దుందుడుకు నిర్ణయాలు తీసుకున్నా, కేంద్రం కూడా అంతే మొండిగా వ్యవహరించినా అంతిమంగా నష్టపోయేది ప్రజలే! కేంద్ర ప్రభుత్వ సహాయంపై ఆధారపడిన అనేక పథకాలు ఇప్పుడు రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. ఇవి ఏపీకి మాత్రమే ప్రత్యేకం కాకపోవచ్చు గానీ సదరు పథకాల అమలు సజావుగా సాగాలంటే కేంద్రం సహాయం తప్పనిసరి! ఏ కారణం వల్లనైనా తెలుగుదేశం– బీజేపీ మధ్య మైత్రీబంధం తెగిపోతే దాని ప్రభావం రాష్ట్రంపై పడుతుంది.

భారతీయ జనతాపార్టీతో ఇంకెందుకు? బయటకు వచ్చేయండి అన్న నోళ్లు రేపు అదెందుకు జరగడం లేదు– ఇదెందుకు జరగడం లేదు అని విమర్శిస్తాయి. రానున్న ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి తీసుకునే నిర్ణయాలు, విసిరే సవాళ్లు వేరు. దీర్ఘకాల రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవలసిన నిర్ణయాలు వేరు. ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనా సహాయం కోసం రాష్ట్రం ఎదురుచూడవలసిందే! అలా అని పిల్లి కదా అని గదిలో బంధించి కొడితే ఎదురుతిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత మోదీ–షాల ద్వయంపైనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటివరకు విధేయుడిగా ఉండి ఉండవచ్చు గానీ, ఇకపై అలా ఉండాలనుకున్నా ఉండలేని పరిస్థితి ఆయనకు ఎదురవుతున్నది.

ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజా జీవితంలో ఉన్నవారు నడుచుకోవలసిందే! పరిస్థితులు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకంత మొండిగా ఉంటున్నారో తెలియదు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఆయన అలా వ్యవహరిస్తూ ఉండవచ్చు గానీ అంతిమంగా అది నష్టం చేస్తుంది. పరీక్షలు రాసే పిల్లలకు కౌన్సెలింగ్‌ పేరిట కొన్ని గంటలు కేటాయించిన మోదీ, అయిదు కోట్ల ప్రజల సమస్యపై అందులో సగం సమయం కూడా కేటాయించలేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పిల్లలకే కాదు తాను కూడా ఎన్నికలనే పరీక్షను ఎదుర్కోబోతున్నట్టు ప్రధాని చెప్పుకొన్నారు. నిజమే! ఎన్నికల పరీక్షలో నెగ్గాలంటే మెజారిటీ సాధించాలి కదా? మబ్బులను చూసుకుని చెంబులోని నీళ్లు ఒలకబోసుకున్నట్టు కొత్త వారిని వెతుక్కుంటూ జతగా ఉన్నవారిని వదులుకోవడం తెలివితక్కువతనం కాదా? నిజానికి పరీక్షలు రాసే విద్యార్థుల కంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే కౌన్సెలింగ్‌ ఎక్కువ అవసరం అని అనిపిస్తోంది. అయితే దురదృష్టవశాత్తూ ఆయనకు కౌన్సెలింగ్‌ ఇవ్వగలిగేవారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎవరూ లేరు.

రాజకీయాలలో ఎవరి వ్యూహాలు వారివి. వైసీపీ ఎంచుకున్న ఎంపీల రాజీనామాల అస్త్రానికి విరుగుడుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతివ్యూహాన్ని రచించకుండా ఉండలేరు. ఈ మేరకు ఆయనకు ఇంటా– బయటా కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మార్చి అయిదున పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాని పక్షంలో పార్లమెంట్‌ సమావేశాల తొలి రోజునే కేంద్రంలో తెలుగుదేశం తరఫున మంత్రులుగా ఉన్న అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి రాజీనామాలు చేసే అవకాశం ఉంది. ఈ ఇరువురి రాజీనామాల తర్వాత కూడా కేంద్రం వైఖరిలో మార్పు రాని పక్షంలో భారతీయ జనతా పార్టీతో మైత్రీ బంధానికి చెల్లుచీటీ ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏదిఏమైనా రాష్ర్టానికి న్యాయం జరుగుతుందా? లేదా? భారతీయ జనతా పార్టీ– తెలుగుదేశంపార్టీల మైత్రీ బంధం కొనసాగుతుందా? లేదా? అన్నది మార్చి చివరినాటికి తేలిపోతుంది.

ALSO READ:  Is Kukatpally TDP Candidate 'Nandamuri Suhasini' - A Mere Pawn In TDP Supremo's Hands?

తెలుగుదేశం నుంచి వచ్చే ఈ ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గి రాష్ర్టానికి న్యాయం చేస్తే ఆ క్రెడిట్‌ తమ ఖాతాలోకే వస్తుందన్నది తెలుగుదేశం నాయకుల అంచనా! ఒకవేళ కేంద్రంలో కదలిక లేకపోయినా తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడిందన్న ఖ్యాతి మిగులుతుందని ఆ పార్టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. వైసీపీ విధించిన గడువు ఏప్రిల్‌ ఆరు కనుక తెలుగుదేశం పార్టీ ఆలోపే అమీతుమీ తేల్చుకుంటుంది. అప్పుడు ఏప్రిల్‌ ఆరున వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా పూర్వపక్షం అవుతుంది. సభలో ప్రధానమంత్రిని నిలదీయకుండా, సమావేశాలు ముగిశాక రాజీనామాలు చేస్తే ప్రయోజనం ఉండదు. ఇలా చేయడం వల్ల తనపై ఉన్న కేసులకు భయపడి సభలో ప్రధానమంత్రిని నిలదీయలేకపోతున్నారన్న విమర్శలను జగన్మోహన్‌రెడ్డి ఎదుర్కోవలసి వస్తుంది. తెలుగుదేశం, వైసీపీ వ్యూహాల వల్ల రాష్ర్టానికి మేలు జరుగుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.

భారతీయ జనతా పార్టీకి చంద్రబాబునాయుడు గుడ్‌బై చెప్పే పక్షంలో జాతీయ స్థాయి రాజకీయాలలో కూడా అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. జాతీయ స్థాయిలో చంద్రబాబుకు ఉన్న పరిచయాలు, పరపతి దృష్ట్యా బీజేపీకి వ్యతిరేకంగా విశాల ఫ్రంట్‌ ఏర్పాటుకు చొరవ తీసుకోవలసిందిగా ఆయనపై ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో డీఎంకే, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ వంటివాళ్లు చంద్రబాబుతో జట్టు కట్టే అవకాశం లేకపోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కలవవచ్చు. అదే జరిగితే ఈ కూటమికి దాదాపు వంద సీట్ల బలం చేకూరుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం చోటుచేసుకుంటే అది అంతిమంగా నరేంద్ర మోదీ అధికారానికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది.

ఇదిలా ఉండగా, రాష్ర్టానికి అందిన సహాయం విషయంలో నిజానిజాలు తేల్చడానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటుచేసిన జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ రెండు రోజుల సమావేశం ముగిసింది. నిజానికి ఎవరి లెక్కలు నిజం, ఎవరి వాదనలో పస ఉందో తేల్చడం ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు తేలాల్సింది ఒక్కటే! రాష్ర్టానికి కేంద్రం నుంచి ఏమేం రావాలి? ఎప్పటిలోగా ఇస్తారు? అన్నది మాత్రమే! నిజనిర్ధారణ కమిటీలు అన్నవి జరిగిన సంఘటనలపై ప్రజలలో అనుమానాలు, అపోహలు ఉన్నప్పుడు మాత్రమే ఏర్పాటు అవుతాయి. ఇప్పుడు రాష్ర్టానికి అన్యాయం జరిగిందన్న విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలెవ్వరికీ అపోహలు, అనుమానాలు లేవు. రాష్ర్టానికి న్యాయం చేశామని స్థానిక బీజేపీ నాయకులు మాత్రమే చెప్పుకొంటున్నారు. వారి మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా నిజం ఏమిటన్నది అప్రస్తుతం. రాష్ర్టానికి కేంద్రం న్యాయం చేసిందని పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని కమిటీ చెప్పగలదా? లేక కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని చెబుతారా? ఆంధ్రప్రదేశ్‌కు ఏదో చేయాలన్న తపనతో పవన్‌ కల్యాణ్‌ ఏదో చేస్తున్నారు.

ఈ కమిటీ పాత్రపై అవగాహన ఉన్నందునే కాబోలు జయప్రకాశ్‌నారాయణ్‌ మాట్లాడుతూ, తమపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంచేశారు. మొత్తంమీద పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటుచేసిన కమిటీ వల్ల ఖాళీగా ఉన్న కొంతమందికి చేతి నిండా, నోటి నిండా పని లభించింది. అయినా ఆంధ్రప్రదేశ్‌ గురించి ఏర్పాటైన కమిటీ హైదరాబాద్‌లో సమావేశం అవ్వడం ఏమిటన్న విమర్శలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఏపీలో నివసిస్తున్నవారు కూడా ఈ సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చారు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ దుస్థితికి అద్దం పట్టడం లేదా? హైదరాబాద్‌ను వదలకుండా ఇక్కడే నివసిస్తూ ఏపీలో రాజకీయాలు చేయాలనుకునే వారి వల్ల ఆ రాష్ర్టానికి లాభమా? నష్టమా? అన్నది ప్రజలే ఆలోచించుకోవాలి.

ప్రత్యేకమైన సమస్యపై అధ్యయనం చేసే కమిటీకి లోగో ఎందుకో అర్థంకాని పరిస్థితి. నిజ నిర్ధారణ కమిటీకి లోగో ఆవిష్కరించడం ఇప్పుడే చూస్తున్నాం. స్పందించే హృదయం ఉందని చెప్పుకొనేవారు ఆలోచించడం కూడా నేర్చుకోవాలి. అయినా పవన్‌ కల్యాణ్‌ వంటివారిని అర్థం చేసుకోవడం కష్టం! అన్నట్టు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు ఈ మధ్య పవన్‌ కల్యాణ్‌పై కొత్త ప్రేమ పుట్టుకొచ్చిందనీ, అందులో భాగంగానే ఆయన పవన్‌ కల్యాణ్‌ను ఇటీవల రెండు మూడు పర్యాయాలు కలిశారనీ బలంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాల్సిందిగా గవర్నర్‌ నరసింహనే పవన్‌ కల్యాణ్‌కు సూచించారని కూడా చెబుతున్నారు. నరసింహన్‌– పవన్‌ కల్యాణ్‌ సమావేశాలు నిజమైతే అందులోని చిదంబర రహస్యం ఏమిటో వెల్లడి కావలసి ఉంటుంది! #KhabarLive