తెలంగాణ రాష్ట్ర సర్కారును కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. తాజాగా మరో అంశంపై సర్కారుకు చెమటలు పట్టించేందుకు కార్యాచరణ షురూ చేశారు. మానిపోతున్న పుండును కోదండరాం మళ్లీ గిచ్చి రెచ్చిస్తున్నారని టిఆర్ఎస్ గుర్రుగా ఉంది. ఇంతకూ టిఆర్ఎస్ పుండుమీద గిచ్చడమేంటబ్బా అనుకుంటే చదవండి స్టోరీ.

నేరెళ్ల ఘటన అనగానే యావత్ తెలంగాణకు ఠక్కున గుర్తొచ్చేది అక్కడ పోలీసులు సాగించిన హింసాకాండ. నేరెళ్లలో ఇసుక మాఫియా లారీలను కాలబెట్టారన్న కోపంతో పోలీసులు చెలరేగిపోయి నేరెళ్లలో దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. పోలీసు దెబ్బలు రుచిచూసిన బాధితుల ఆరోగ్యం ఇంకా బాగు కాలేదు. అధికార పార్టీ లారీలను కాలబెడతారా అన్న కోఫంతోనే పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలున్నాయి.

ఈ ఇసుక మాఫియా అంతా తెలంగాణ మంత్రి కేటిఆర్ కనుసన్నల్లోనే సాగుతుందన్న విమర్శలను ఇటు జెఎసితోపాటు మిగతా రాజకీయ పక్షాలన్నీ గుప్పించాయి. నేరెళ్లలో పోలీసులు చెలరేగిపోయి అక్కడి దళితులను, యాదవులను, బుడగజంగాల వారిని చితకబాదిర్రు. ఇసుక లారీలు జనాలను తొక్కిచ్చి చంపుతున్నాయన్న కోపంతో వాళ్లు లారీలు కాబెట్టారు. సిరిసిల్ల జిల్లాలో పది మంది వరకు ఇసుక లారీలు బలి తీసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ALSO READ:  'When Scholarships Don’t Arrive, Disadvantaged Students Work On Small Jobs, Skip Meals And Do Crimes To Meet The End'

నేరెళ్ల బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. అక్కడి యువకులను థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధించిన జిల్లా ఎస్పీ అక్కడే తిష్ట వేసి ఉన్నాడు. తూ.తూ.మంత్రంగా ఒక బుడ్డ పర్క లాంటి పోలీసు ఆఫీసరును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే మాఫియా ఇసుక లారీల విషయంలో విచారణ ఏమాత్రం జరపడంలేదన్న విమర్శ ఉంది. బాధితుల ఆరోగ్యం ఇంకా బాగు కాలేదు. కొంతమంది లేవలేని దుస్థితిలో ఉన్నారు. కొందరిని సంసారానికి పనికిరాకుండా కొట్టారన్న విమర్శలున్నాయి. పలు సందర్భాల్లో నేరెళ్ల బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సంఘటన జరిగి చాలారోజులైనందున ఈ వివాదం ముగిసిపోయినట్లేనన్న భావనలో టిఆర్ఎస్ సర్కారు ఉంది. ఇక దీనిపై పెద్దగా వివాదం రాదన్న ఉద్దేశంతో సర్కారు ఉంది. కానీ తాజాగా తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని కలిశారు. నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోదండరాం ఒక్కరే కాదు.. అఖిలపక్షంతో కలిసి వెళ్లి హోంమంత్రికి వినతిపత్రం సమర్పించారు. అఖిలపక్షంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, ఆర్ఎస్పి లాంటి పార్టీలున్నాయి.

ALSO READ:  Is Chandrababu Naidu Really Serious Or Just 'Playing Drama'?

ఈ సందర్భంగా అనేక కీలక డిమాండ్లను అఖిలపక్షం నేతలు సర్కారు ముందుంచారు. తక్షణమే సిరిసిల్ల ఎస్పీ మీద, బాధ్యులైన పోలీసు అధికారుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణమే పూర్తి స్థాయి వైద్యం అందించాలని, ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. ఇసుక మాఫియాను కంట్రోల్ చేయాలని కోరారు.

మొత్తానికి సద్దుమణిగిందనుకున్న నేరెళ్ల ఇష్యూను మరోసారి రాజకీయ తెర మీదకు కోదండరాం తీసుకు రావడం చర్చనీయాంశమైంది. #KhabarLive